మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, హోం మంత్రిత్వ శాఖపై తనకు ఆసక్తి ఉన్నప్పటికీ, హైకమాండ్ ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తాను ప్రజలకు అండగా నిలుస్తానని చెప్పారు. ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని అన్నారు.
నిన్న ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ సహా వివిధ అంశాలపై వారు చర్చించారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులకు చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.