శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆమె సోషల్ మీడియా వేదికగా ద్వారా ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కృషి చేశామని, అది ఫలించిందని చెప్పారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధుల సిఫార్సును అంగీకరించడం నూతన సంవత్సర కానుకగా అభివర్ణించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిరంతరం పరస్పర సహకారం అవసరమన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం తెలిపినందుకు గాను ఏపీ సీఎంతో పాటు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.