మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య కేసు కూటమి ప్రభుత్వంలో రాజకీయ దుమారం రేపింది. బీడ్ జిల్లాలో డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్(45) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఫిబ్రవరి 27న పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఇందులో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడి పేరు ఉంది. అంతేకాకుండా మంత్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. దీంతో ధనంజయ్ ముండేను రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. ధనంజయ్ ముండే రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. వెంటనే దేవేంద్ర ఫడ్నవిస్ ఆమోదించి, గవర్నర్ రాధాకృష్ణన్‌కు పంపించారు.
ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్‌లో మసాజోగ్ గ్రామ సర్పంచి సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి అనంతరం చిత్రహింసలకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. హంతకులు ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా తీసినట్లు సమాచారం. ఈ వీడియోల్లో సర్పంచ్‌ను అత్యంత క్రూరంగా హింసించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా మంత్రిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో కూటమి ప్రభుత్వం తలొగ్గింది. ఈ నేపథ్యంలో ధనంజయ్ రాజీనామా చేయక తప్పలేదు.