రాష్ట్ర రాజకీయాల్లో హైటెన్షన్ తో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ డైలాగ్ వార్. కౌశిక్‌రెడ్డిపై దాడి ఘటన నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 13) ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని తన నివాసంలో హరీష్ రావును పోలీసులు నిర్భందించారు. హరీశ్ రావు ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

మరోవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌లను కూడా పోలీసులు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా గృహనిర్బంధంలో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా హైదరాబాద్ రావాలని హరీశ్ రావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ ఎస్ నేతలు హైదరాబాద్ చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గాంధీ ఇంటికి చేరుకుంటానని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *