అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు హరీష్ రావుతో సమావేశమయ్యారు. బిసి రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బిఆర్ఎస్ నాయకులను కోరారు. ఆయన, బీసీ నాయకులతో కలిసి కేటీఆర్ కు మెమొరాండం అందజేశారు. అలాగే బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను కోరారు. వీరి సమావేశంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ నెల 1న మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాలేదు. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.