మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీ నది గర్భంలో ప్రవేటు ప్రజలకు చెందిన సుమారు 1600 నిర్మాణాలను సర్వేలో గుర్తించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. నిర్వాసిత ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ నదీ ప్రాంతం, బఫర్‌జోన్‌లో నిర్మించిన కుటుంబాల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 15 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసిందన్నారు. అలాగే నదీసమీపంలోని నిర్మాణాలకు సంబంధించిన పునరావాస చర్యలకు సంబంధించి మూసీ రివర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మూసీ నది పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దని, అర్హులందరికీ పునరావాసం కల్పించడం జరుగుతుంది అని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ వెల్లడించారు.