హైదరాబాద్‌లో ఆకస్మికంగా వీచే ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షపాతం ప్రభావం జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూలిన చెట్లను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అత్యవసర బృందాలు, డీఆర్‌ఎఫ్ బృందాలను ఆదేశించారు.
చార్మినార్, బహదూర్‌పురా, నాంపల్లి, అంబర్‌పేట్, ఖైరతాబాద్, ఎల్‌బి నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ మరియు నగరంలోని ఇతర ప్రాంతాల్లో వర్షపాత ప్రభావం ఉందని వెల్లడించారు. పోలీస్ , జీహెచ్ఎంసీ , వాటర్ బోర్డు ,విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకొని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.