హైదరాబాద్‌: ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందజేయనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్‌లో సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 41 మంది అభ్యర్థులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పోరాటం కేవలం నియామకాల కోసమేనని అన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు.

యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామన్నారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, ప్రస్తుత డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసినట్లు తెలిపారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. పక్కా ప్రణాళికతో పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రవేశపెడుతామన్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించుకుంటామని చెప్పారు జూన్ 2లోగా నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 9 నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థను అభినందించారు. మెయిన్స్‌కు సన్నద్ధం కావడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, అందరూ మెయిన్స్‌ను ఎంచుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *