భారత న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవం, పూర్తి నమ్మకం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా న్యాయ ప్రక్రియపై తనకు గట్టి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కవిత బెయిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ప్రశ్నిస్తూ పత్రికల్లో వచ్చిన కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన.
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గందరగోళం నెలకొనడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. న్యాయవ్యవస్థపై తనకు గట్టి నమ్మకం ఉందని, పత్రికల్లో తన వ్యాఖ్యలను వక్రీకరించినందుకు బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల తనకు అత్యంత గౌరవం ఉందన్నారు. భారత రాజ్యాంగంలోని నైతికతపై తనకు గట్టి నమ్మకం ఉందని, న్యాయవ్యవస్థ పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు.