Bandi Sanjay

తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి ప్రయత్నిస్తున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని, కేంద్రం అనుమతి లేకుండా అలాంటి భూమిని నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఆయన అన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని బండి సంజయ్ గుర్తు చేశారు. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. కోర్టు కేసు నడుస్తున్నా, ప్రభుత్వం భూముల చదునుకు పాల్పడడం కోర్టు ధిక్కరణకే సంబంధించిన విషయమని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం చెట్లను తొలగించి, పర్యావరణ విధ్వంసం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. భూములను డీఫారెస్టైజేషన్ చేసి వేలం వేసి కోట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తుందని బండి సంజయ్ విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు తన వైఖరి మారడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే భూముల విక్రయంపై ప్రభుత్వం వెనుకడగు వేయాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *