బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అధికారిక నివాసం(ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)పై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తాళాలు పగులగొట్టి పలు వస్తువులు ధ్వంసం చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దాడికి పాల్పడిన వారు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. రుణమాఫీ కోసం హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్థరాత్రి హరీశ్ కార్యాలయం దగ్గర బీఆర్‌ఎస్ కార్యకర్తలు ట్రాఫిక్‌ను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు పంపించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి జరిగిన దాడిని చూస్తుంటే చాలా గందరగోళంగా ఉందంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే నివాసంపై దాడి జరిగితే సామాన్యుల భద్రతకు ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హరీశ్‌రావు అన్నారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని హరీశ్ కోరారు.