ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతుంది. గత ప్రభుత్వం అమలు చేసిన ‘శాశ్వత భూ హక్కు-భూ రక్షణ’ పథకం పేరును మార్పు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి ‘ఏపీ రీసర్వే ప్రాజెక్టు ’ గా మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ను గ్రామాల్లో భూవివాదాలు, తగాదాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకువచ్చామని అప్పట్లో జగన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనిలో భాగంగా భూముల సమగ్ర రీ సర్వే చేపట్టారు. కానీ, ఈ పథకం ఆచరణలోకి వచ్చేసరికి భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితులు ‘శాశ్వత భూ హక్కు-భూ రక్షణ’ పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఈ పథకం అమలు తీరును అప్పటి ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా ఖండించింది.
తాము అధికారంలోకి వస్తే ఈ స్కీమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ‘శాశ్వత భూ హక్కు-భూ రక్షణ పథకం’ పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతకు ముందున్న పేర్లను మార్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలో వచ్చిన తరువాత పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మన బడి – మన భవిష్యత్‌గా, అమ్మఒడి పథకం పేరు తల్లికి వందనంగా , గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. జగనన్న ఆణిముత్యాలు పథకానికి అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారం గా నామకరణంగా, స్వేచ్ఛ పథకానికి బాలికా రక్ష గా పేరు మార్పు చేశారు. ఇలా పలు రకాల పథకాల పేర్లను మార్చారు.