ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సమావేశం కానున్నారని తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, జూలై 2024లో ఇద్దరూ తొలిసారి కలిశారు.
ఆ సమయంలో ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో విభజన అంశాలపై చర్చించారు. విడిపోయి పదేళ్లు గడిచినా, చట్టం ప్రకారం అవసరమైన పంపకాలు పూర్తి కాకపోవడంపై ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టి సారించారని అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఇంకా పరిష్కృతం కాని సమస్యలపై తాజాగా మరోమారు భేటీ కావాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.