మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూసీ పునరుజ్జీవం పేరుతో డ్రైనేజీ నీటిని మూసీ నదిలో కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ నది రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పునరుజ్జీవమా? సుందరీకరణా? అన్నది తమకు అనవసరమని ఆయన అన్నారు.
అయితే పేదల ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేయవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మూసీ నది సుందరీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. తాము పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదని, అలాగే పేదల ఇళ్లను అకారణంగా కూల్చివేస్తే ఊరుకోబోమని, కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. సుందరీకరణ కూడా చేయవచ్చని వెల్లడించారు. మూసీ ప్రక్షాళనపై నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. గరళకూపంగా ఉన్న మూసీని మంచినీరుగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేసారు.