వరంగల్: రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2050 నాటి జనాభా, అవసరాలను దృష్టిలో ఉంచుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఫార్మా సిటీ, అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ, ఐటీ సర్వీసెస్‍, మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌ యూనిట్లు, ఎకో టూరిజం, విద్యాసంస్థలు, విమానాశ్రయం, స్టేడియం, లాజిస్టిక్స్ పార్క్, టూరిజం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్నర్‍, ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామన్నారు.

విమానాశ్రయం నిర్మాణంతో పాటు సెంట్రల్ జైలు స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. నర్సంపేటలో ఈ ఏడాది నుంచి వైద్య కళాశాల, ఆసుపత్రి సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు. వరంగల్‌‌‌‌ నగరంలో వరద ముంపు సమస్య రాకుండా నాలాలను విస్తరిస్తామని చెప్పారు. వరంగల్‌‌‌‌ పాత బస్టాండ్‌‌‌‌ స్థానంలో కొత్తది, రూ.80 కోట్లతో వరంగల్‍ కలెక్టరేట్‍ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటినట్లు వివరించారు. కాళోజీ కళాక్షేత్రాన్ని సెప్టెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‍ సత్యశారద, మేయర్‍ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌‌‌‌రెడ్డి, కేఆర్‍.నాగరాజు, కుడా చైర్మన్‌‌‌‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, డీసీపీ రవీందర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *