కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి జోగి రమేష్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మంగళవారం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
జోగి రమేష్ అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖలో భారీగా అక్రమాలతో పాటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇంటిని మొత్తం తమ అధీనంలోకి తీసుకుని 15 మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడ పడుతున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.