భారతీయ సంతతికి చెందిన మహిళా శాస్త్రవేత్త రాగా దీపిక నేతృత్వంలోని బృందం మధ్యస్థాయి బ్లాక్ హోల్ కు సంబంధించిన భారీ శాంపిల్స్ తో పాటు మరుగుజ్జు గెలాక్సీలను కనుగొంది. అలాగే ఈ గెలాక్సీల్లో ఒక బ్లాక్ హోల్ యాక్టివ్ గా ఉందని గుర్తించింది. తాము కనుగొన్న శాంపిల్స్ ప్రస్తుతం ఉన్న బ్లాక్ హోల్స్, మరుగుజ్జు గెలాక్సీల కంటే మూడు రెట్లు పెద్దవని శాస్త్రవేత్తలు తెలిపారు. వారి అధ్యయనంతో, మరగుజ్జు గెలాక్సీల పరిణామం మరియు బ్లాక్ హోల్స్ అభివృద్ధిపై మరింత లోతైన పరిశోధన చేయవచ్చని చెప్పారు.
అలాగే, విశ్వంలోని మొదటి బ్లాక్ హోల్స్ పరిణామాన్ని అధ్యయనం చేయడానికి తమ అధ్యయనం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్‌స్ట్రుమెంట్ నుండి డేటాను ఉపయోగించి, దీపిక బృందం భారీ నమూనాలను సేకరించారు. రాగ దీపిక తల్లిదండ్రులు ఏపీకి చెందిన వారు. వీరు గుంటూరు జిల్లా తెనాలిలో నివాసం ఉంటున్నారు.