పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానా రొనాల్డోకు నిరాశే మిగిలింది. తన చివరి యూరో కప్‌లో జట్టును విజేతగా నిలపాలనుకున్న రొనాల్డో ఆశలు ఆవిరయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో పోర్చుగల్ ఇంటిముఖం పట్టింది. ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో షూటౌట్‌లో 3-5 తేడాతో పోర్చుగల్ పరాజయాన్ని చవిచూసింది.

నిర్ణీత సమయంతో పాటు అదనపు సమయంలోనూ ఫ్రాన్స్-పోర్చుగల్ గోల్ సాధించలేకపోయాయి. దీంతో షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో ఎంబాపే బృందం పైచేయి సాధించింది. అయిదు గోల్స్ కొట్టి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ అనంతరం రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

మరోవైపు పెపె దుఃఖం ఆపుకోలేక రొనాల్డోను పట్టుకొని గట్టిగా ఏడ్చాడు. తన కన్నీళ్లను ఆపుకుంటూ రొనాల్డో పెపెను ఓదార్చాడు. ఇదే తన చివరి యూరో కప్ అని రొనాల్డో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 2004లో తొలి యూరో కప్ ఆడిన రొనాల్డో మొత్తంగా ఆరు సార్లు ఈ మెగాటోర్నీలో ఆడాడు. కాగా, సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీపై స్పెయిన్ 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. జర్మనీపై తన అజేయ రికార్డును స్పెయిన్ కొనసాగించింది. అయితే జర్మనీ ఆఖరి వరకు గొప్పగా పోరాడింది.

అదనపు సమయం మరో నిమిషంతో ముగుస్తుందనగా స్కోరు 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీస్తుందని భావించారంతా. కానీ మైకెల్‌ మెరినో ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు. 119వ నిమిషంలో ఓల్మో అందించిన క్రాస్‌ను హెడర్‌తో మెరినో గొప్పగా గోల్‌ సాధించాడు. దీంతో స్పెయిన్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి విజయతీరాలకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *