వడోదరా: ఇటీవలే బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో హార్దిక్ పాండ్య చివరి ఓవర్ లో అద్భుతమైన బౌలింగ్ వేసి ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. జరిగిన మ్యాచ్ లో పాండ్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా హార్దిక్ పాండ్యా తన సొంతగడ్డకు చేరుకోగా అభిమానులు భారీగా తరలివచ్చి పాండ్యకి ఘన స్వాగతం పలికారు. 17 ఏండ్ల సుదీర్ఘ కల సాకారమైన వేళ పాండ్యాకు వడోదరలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మెగాటోర్నీ గెలిచిన తర్వాత తొలిసారి సొంతగడ్డకు వచ్చిన పాండ్యాను ఫ్యాన్స్ మంగళవారం భారీగా ఊరేగించారు. అదేవిదంగా పాండ్యకు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా అభిమానులతో నిండిపోయింది. హార్దిక్ హార్దిక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అభిమానుల హోరు మధ్య పాండ్యా ఓపెన్‌బస్‌లో అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హార్దిక్ ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. జట్టును నడిపించడంలో మరియు బౌలింగ్ లో కూడా హార్దిక్ విఫలమైయ్యాడు. దీంతో పాటు సాంఘిక ప్రసార మాధ్యమంలో తెగ ట్రోల్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ లో తన ఆట ప్రదర్శనకి ఫ్యాన్స్ అందరు ఫిదా అయ్యారు. ఎవరైతే ట్రోల్ చేసారో వారే ఇప్పుడు హార్దిక్ హార్దిక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.