IND VS ENG: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. జూలై 6, ఆదివారం ముగిసిన రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించి, విదేశాల్లో పరుగుల పరంగా ఇప్పటివరకు పొందిన అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఇదివరకు ఈ వేదికపై టీమిండియా ఒక్క విజయం కూడా సాధించలేదు. గతంలో ఈ స్టేడియంలో భారత్ ఎనిమిది టెస్టులు ఆడి ఏడింటిలో ఓడిపోగా, ఒక్క మ్యాచ్ డ్రా అయింది. 1967లో పటౌడీ నేతృత్వంలో తొలిసారి ఈ వేదికపై ఆడిన భారత్ జట్టు 132 పరుగుల తేడాతో ఓడిపోయింది. అనంతరం కపిల్ దేవ్ నాయకత్వంలో 1986లో జరిగిన మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. అజిత్ వాడేకర్, ధోనీ, కోహ్లీ, బుమ్రా వంటి దిగ్గజుల కెప్టెన్సీలో ఈ వేదికపై భారత జట్టు విజయం పొందలేకపోయింది. కానీ శుభ్మన్ గిల్ నేతృత్వంలో ఈ సారి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ విజయం ద్వారా ఎడ్జ్‌బాస్టన్ వేదికపై టెస్టు గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్, శ్రీలంకలు కలిపి 18 మ్యాచ్‌లు ఆడినా విజయం నమోదు కాలేకపోయాయి. గిల్ ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ కలిపి మొత్తం 430 పరుగులు చేయడంతో పాటు కెప్టెన్సీలోనూ అదరగొట్టాడు. మరోవైపు ఆకాశ్ దీప్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ (10/187)తో రెండు ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కట్టడి చేశాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్‌కు 608 పరుగుల టార్గెట్ లభించగా, వారు రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే కుప్పకూలి ఓటమి చెందారు. 1-1తో సిరీస్ సమం అయింది.
Internal Links:
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..
నేడు ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు ఆరంభం..
External Links:
ఎడ్జ్ బాస్టన్‌లో చారిత్రాత్మక విజయం.. దిగ్గజాలకు సాధ్యం కానిది చేసి చూపించిన గిల్