తెలుగుతేజం పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్‌పై 21-9, 21-6తో వరుస సెట్లలో విజయం సాధించింది. తాజాగా బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కుబాను కూడా ఓడించింది. తొలి మ్యాచ్‌కు మించి బుధవారం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు సత్తా చాటింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 21-5తో గెలుచుకుంది. ఆ తర్వాత రెండో సెట్ లో క్రిస్టిన్ కుబా కాస్త ప్రతిఘటించినా సింధు ముందు నిలవలేకపోయింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ 21-10తో రెండో సెట్‌ను గెలుచుకుని విశ్వక్రీడల్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌లో మూడో పతకం దిశగా మరో అడుగు పడింది. 16వ రౌండ్‌కు చేరుకుంది. ఇటీవల ఫామ్‌తో సతమతమవుతున్న సింధు, విశ్వక్రీడల్లో మాత్రం సత్తా చాటుతోంది. ప్రత్యర్థిని చిత్తు చేస్తూ, దూసుకెళ్తోంది. రియో ఒలింపిక్స్ 2016లో రజత పతకం సాధించిన ఈ తెలుగు తేజం. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈసారి ఏ పతకం సాధించినా హ్యాట్రిక్ ఒలింపిక్ పతకాలు సాధించిన క్రీడాకారుల జాబితాలో సింధు చేరనుంది.