పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పతకాల వేట ముగిసింది. పీవీ సింధు 2016లో రజతం, 2020లో కాంస్యం సాధించింది. ఈసారి ఒలింపిక్స్ 2024లో మాత్రం ప్రీక్వార్టర్స్ వరకే పరిమితమై ఖాళీ చేతులతో ఇంటిముఖం పట్టింది. గురువారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో పివి సింధు 19-21, 14-21 తేడాతో ప్రపంచ 9వ ర్యాంకర్ చైనా షట్లర్ హి బింగ్ జావోతో వరుస సెట్లలో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఇద్దరు షట్లర్ల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. క్రాస్ కోర్ట్ షాట్లతో సింధు తనదైన శైలిలో రెచ్చిపోగా, చైనా క్రీడాకారిణి స్మాష్ లతో పైచేయి సాధించింది. దాంతో తొలి గేమ్ గెలిచింది. నిజానికి పివి సింధు అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పవచ్చు. రెండో గేమ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన బింగ్ జావ్ వరుస పాయింట్లతో సింధుపై ఒత్తిడిని పెంచడంతో ఆ గేమ్ లో ఓటమిని అంగీకరించక తప్పలేదు.