టీమిండియా మహిళా బ్యాటర్, వికెట్ కీపర్ రిచా ఘోష్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డ్ నమోదు చేసింది. మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో రిచా ఫిఫ్టీ సాధించి ఈ గౌరవాన్ని అందుకుంది. యూఏఈపై రిచా 29 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 64 పరుగులు చేసింది. రిచా ఘోష్ 20 ఏళ్ల 297 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసింది. దీంతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డును బద్దలు కొట్టింది. పంత్ 21 ఏళ్ల 206 రోజుల వయసులో తన టీ20 అర్ధ సెంచరీని సాధించాడు.
2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌కు ఈ ఘనత లభించింది. అంతేకాదు మహిళల ఆసియా కప్ చరిత్రలో హాఫ్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించింది. రిచా ఇప్పటి వరకు భారత్ తరఫున 2 టెస్టులు, 23 వన్డేలు, 52 టీ20లు ఆడింది. టీ20లో ఇదే తొలి అర్ధశతకం కావడం విశేషం. రిచా ఘోష్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. రిచాతో కలిసి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66) హాఫ్ సెంచరీ చేసింది. టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. చేధనలో యూఏఈ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. కవిషా (40 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది.