పల్లెకెలె: కొత్త కోచ్, కొత్త కెప్టెన్ సారథ్యంలో టీ20 ప్రపంచ చాంపియన్ భారత్ ఈ ఫార్మాట్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగే తొలి మ్యాచ్ లో శుభారంభం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ద్రావిడ్ స్థానంలో టీ20లకు గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా మారిన సూర్యకుమార్ ఈ సిరీస్‌లో తమ సత్తా చాటాలని ఆశిస్తున్నారు. కోచ్‌గా ఎంపికైన వెంటనే హార్దిక్ పాండ్యాకు బదులుగా టీ20 టాప్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్‌కు కెప్టెన్సీ అప్పగించి గౌతీ తన మార్క్ చూపించాడు. రోహిత్, కోహ్లి, జడేజా వంటి సీనియర్లు టీ20ల నుంచి రిటైరవ్వడంతో వైట్ బాల్ ఫార్మాట్ల వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్, రింకూసింగ్, ర్యాన్ పరాగ్‌లకు తమ స్థానాలను భర్తీ చేసేందుకు ఇది మంచి అవకాశం. పేస్ లీడర్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఈ విభాగాన్ని నడిపించనున్నారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో చెత్తగా ఆడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన శ్రీలంక కొత్త కెప్టెన్ చరిత్ అసలంక నాయకత్వంలో సొంతగడ్డపై ఈ సిరీస్‌లో అయినా సత్తా చాటాలని కోరుకుంటోంది.