ఇటీవలే బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ సౌతాఫ్రికాపై విజయం సాధించి ప్రపంచకప్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. భారత జట్టు శ్రీలంక పర్యటన ఈనెల 27వ తేదీ నుంచి ఖరారైయింది. ఇందులో భాగంగా టీ20 వన్డే సిరీస్ ఈ నెల 27వ తేదీ నుండి ఆగస్ట్ 2 వరకు జరగనున్నాయి. శ్రీలంక పర్యటనకు సంబందించిన భారత జట్టును నేడు బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. శ్రీలంక పర్యటనకు బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడింది. శ్రీలంక పర్యటనకు సంబందించిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కొత్త టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే ఇటీవల జింబాబ్వేలో జరిగిన టీ20 సిరీస్ కి గిల్ సారధిగా ఉండి సిరీస్ ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ జింబాబ్వే లో పర్యటించిన యువజట్టుకి ప్రాధాన్యత ఇవ్వనున్నారని కీలక వర్గాలు తెల్పుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లకు ఈ పర్యటనకు కూడా విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి.