News5am Telugu Latest News Today ( 08/05/2025) : టీమిండియా అభిమానులకు శాక్ ఇచ్చే వార్త. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ ప్రకటన చేశాడు. ఇప్పటికే రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టెస్టు క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. అయితే, రోహిత్ వన్డేల్లో మాత్రం కొనసాగనున్నాడు. 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడే అవకాశాలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని రోహిత్ ఎన్నోసార్లు చెప్పిన విషయమే.
38 ఏళ్ల రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌లో మొత్తం 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. కెప్టెన్‌గా 24 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహించి, 12 విజయాలు సాధించాడు. జూన్ 2025లో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ఎంపికకు ముందు రోహిత్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్అ-గవాస్కర్ 2025లో రోహిత్ నిరాశపరిచాడు. పేలవ ఫామ్ కారణంగా చివరి టెస్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. టెస్టుల్లో ఇటీవల ఫామ్ లోపం కారణంగానే హిట్‌మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అందరూ భావిస్తున్నారు.