తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి మహోత్సవం ప్రారంభమైంది. సూర్య జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ మలయప్పస్వామి సప్తవాహనాల సేవలో భాగంగా ముందుగా సూర్యప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయి.రథసప్తమి వేడుకల కోసం తిరుమలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారి నుదురు, నాభి, కమల పాదాలపై భానుడుగా పిలిచే తొలి సూర్యకిరణాల దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు దారి పొడవునా రంగురంగుల పుష్పాలంకరణ నిర్వహించారు.
ఇందుకోసం దాదాపు ఏడు టన్నుల సంప్రదాయ పూలు, 50,000 కట్ ఫ్లవర్లను ఉపయోగించారు. భక్తుల భద్రత కోసం టీటీడీ నిఘా, భద్రతా విభాగం, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వాహన సేవల షెడ్యూల్ ఇలా ఉంది: – 5.30-8.00 AM: సూర్యప్రభ వాహనం (ఉదయం 6.40 AM కి సూర్యోదయం) – 9-10 AM: చిన్నశేష వాహనం- 11-12 AM: గరుడ వాహనం – 1-2 PM: హనుమంత వాహనం – 2-3 PM: చక్ర స్నానం – 4-5 PM: కల్పవృక్ష వాహనం – 6-7 PM: సర్వభూపాల వాహనం – రాత్రి 8-9 PM: చంద్రప్రభ వాహనం మాత్రమే ఈరోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు బ్రేక్ దర్శనానికి అవకాశం ఉంటుంది. సర్వదర్శనం టోకెన్ల జారీని శనివారం వరకు తాత్కాలికంగా నిలిపివేసినందున, భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుండి శ్రీవారిని దర్శించుకోవచ్చు.