ఈ నెల 28న జరగనున్న ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
గోల్నాక శ్రీలక్ష్మీనగర్‌లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయాన్ని రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకారం, బోనం సమర్పిస్తామని కమిటీ ప్రధాన కార్యదర్శి కొమ్మిడి గోపాల్ రెడ్డి తెలిపారు.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం కొనసాగనుంది. తొట్టెల ఊరేగింపులు జరుగుతాయని తెలిపారు. బోనాల పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాసగౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు.