తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన గురువారం శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై విహారించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బద్రీ నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగిన శ్రీవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని గోవింద నామ స్మరణలతో పులకించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. మాఢ వీధుల్లో భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా వాహనసేవ సాగింది. సూర్యప్రభ వాహన సేవ ఆయురారోగ్యాలు, విద్య, సంతానం ప్రాప్తింపజేస్తుందని భక్తుల నమ్మకం.
ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు దంపతులు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.