కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. పంచామృతలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. రాష్ట్రంలోని వేములవాడ రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి అర్చకులు గోపూజ, మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భద్రాచలం వద్ద భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. హైదరాబాద్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల సందడి వాతావరణం కనిపించింది. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు, గోదావరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉసిరిచెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షణలు చేస్తున్నారు.