ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కడుపు నిండా అన్నం దొరికే విధంగా అన్నపూర్ణదేవి ఆశీర్వదించాలని భక్తులు కోరుకుంటున్నారు.
శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు .అన్నం పరబ్రహ్మం స్వరూపం అని భావించడంతో ఈ రూపంలో అమ్మవారిని భక్తితో కొలుస్తారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రిపై తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. పోలీసులు కూడా క్యూ లైన్ లో ఉన్న భక్తులను క్రమపద్ధతిలో పంపుతున్నారు. వీఐపీల తాకిడి కూడా తక్కువగానే ఉండటంతో ఉదయాన్నే గంట నుంచి రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుందని భక్తులు చెబుతున్నారు.