తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం జరిగిన రథ సప్తమి వాహన సేవలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన రంగుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మొత్తం 900 మంది కళాకారులు పాల్గొన్నారు. ప్రతి వాహన సేవలో 5 కళాబృందాలకు చెందిన కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. కోలాటం, లెజిమ్స్, దీపనృత్యం, కేరళ – ఓనం నృత్యం, జానపద నృత్యం, గోపికా నృత్యం, హారతి నృత్యం, అన్నమయ్య విన్నపాలు నృత్యం, రాజస్థాన్ – దాండియా నృత్యం, పాండిచ్చేరి – కరగట్టం, అస్సాం-బిహు నృత్యాలతో కళాకారులు భక్తులను ఆకట్టుకున్నారు. వీటితో పాటు మోహినీ ఆట్టం, గర్భా నృత్యం, బిందెల నృత్యం, కూచిపూడి నృత్యం, మహారాష్ట్ర లావణి నృత్యం, బెంగాలీ నృత్యం కళాకారులు ప్రదర్శించారు. అన్ని ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్ మరియు దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ. ఆనంద తీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.