ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో లావాదేవీలు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్రం భావించినట్లుగా ప్రజలు అత్యధిక శాతం డిజిటల్ పేమెంట్స్ మీదే ఆధారపడుతున్నారు. అలాగే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కూడా ఎన్నో మార్పులు జరిగాయి. గతంతో పోలిస్తే సేవలు అనేవి గంటల నుంచి నిమిషాల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు చాలా వరకు బ్యాంకుకు వెళ్లకుండానే మన పనులు నిమిషంలో ఫోన్ లోనే అయిపోతున్నాయి. కానీ, ఇప్పటికీ ఏదైనా ఆలస్యం అయితుంది అంటే అది చెక్ క్లియరెన్స్ అనే చెప్పాలి. డిజిటల్ యుగంలోకూడా ఒక చెక్ క్యాష్ గా మారాలి అంటే మాత్రం రెండ్రోజుల సమయం పడుతోంది. బ్యాంకులు ఈ చెక్కు క్లియరెన్స్ విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నాయి. తాజాగా ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
కొన్ని గంటలోనే చెక్ క్లియరెన్స్ అయ్యేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన మార్పును ప్రకటించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ 2024లో ఈ చెక్ విషయమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. చెక్ క్లియరెన్స్ ప్రస్తుతం T+1 విధానం అమలవుతుందని వెల్లడించారు. బ్యాచుల వారీగా ప్రాసెసింగ్ కాకుండా, ఇకపై ఆన్ రియలైజేషన్ సెంటిల్మెంట్ విధానాన్ని అవలంభించబోతున్నాం అని ప్రకటించారు. బ్యాంకుల పనివేళలో చెక్కును స్కాన్ చేసి, ప్రజెంట్ చేసి, కొన్ని గంటలోనే పాస్ చేస్తామని చెప్పారు. ఇలా చేయడం వల్ల రెండ్రోజుల వ్యవధి పడుతున్న చెక్ క్లియరెన్స్ విధానం కొన్ని గంటల్లోకి వచ్చేస్తుంది. దీనికి సంబందించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. యూపీఐ ద్వారా పన్ను చెల్లింపులకు ప్రస్తుతం ఉన్న పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ మరో నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.