భారతదేశంలో బంగారం పరుగులు ఆగట్లేదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జెట్ స్పీడులో పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు నేడు చరిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి ధర లక్ష దాటింది. దాంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు పసిడి వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం శుభకార్యాలకు బంగారం కొనాలన్నా, ఎంతో ఆలోచించాల్సి వస్తోంది.
ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,000 పెరగగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,750 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,900గా, 24 క్యారెట్ల ధర రూ.1,01,350గా నమోదైంది. మరోవైపు ఇప్పటికే వెండి ధర లక్ష దాటిన విషయం తెలిసిందే. నిన్న కిలో వెండిపై రూ.1000 పెరగగా, ఈరోజు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఈరోజు రూ.1,01,000గా ఉంది.