హైదరాబాద్: మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలం షన్నాపూర్లో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. బాధితులు శెట్టబోయిన సిద్దయ్య (50), చాకలి నందు (22) బుధవారం సాయంత్రం కట్టెలు కొట్టేందుకు అడవికి వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడవిలో వెతకడం ప్రారంభించారు. మల్లన్న గుట్ట ప్రాంతంలో పిడుగుపాటుకు గురైన సిద్దయ్య, నందు మృతదేహాలను వారు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.