ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతిని 20 రోజుల పాటు హోటల్ గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య భైంసాకు ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని హైదరాబాద్ నగరానికి వచ్చేలా చేశాడు. బాధిత యువతి నగరానికి చేరుకున్న అనంతరం నారాయణగూడ లోని ఓ హోటల్ కు తీసుకెళ్లి ఆమెను నిర్బంధించాడు. పెళ్లి పేరిట తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా 20 రోజుల పాటు యువతిని లైంగికంగా వేధించాడు. యువతికి తీవ్ర కడుపునొప్పి రావడంతో స్థానిక కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. దీంతో యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.
సరే చేసుకుంటా అని నమ్మించి మళ్లీ నారాయణగూడ హోటల్ రూమ్ కు తీసుకుని వచ్చాడు. ఆ యువతి రూమ్ లోపలికి వెళ్లగానే సదరు యువకుడు హోటల్ రూమ్ కు డోర్ లాక్ చేసి , అక్కడి నుండి పరారయ్యాడు. బాధిత యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి లైవ్ లొకేషన్ ను పంపించింది. యువతి తల్లిదండ్రులు నగరానికి చేరుకుని షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. షీ టీమ్స్ వెంటనే స్పందించి నారాయణగూడ పోలీసుల సహాయంతో బాధితురాలిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నారాయణగూడ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ యువకుడు హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కోర్సు చేస్తున్నాడని తెలిపారు.