తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అమృత తండ్రి మారుతీరావు నేతృత్వంలోని కిరాయి హంతకుల ముఠా దారుణంగా హత్య చేసింది. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడంతో, కోపంతో మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో కలిసి ప్రణయ్ ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ కేసులో తుది తీర్పును మార్చి 10కు న్యాయస్థానం రిజర్వు చేసింది. రెండవ అదనపు సెషన్స్, ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్య వైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా నిందితులలో సుభాష్ శర్మ, అస్గర్ ఆలీ మినహా ఇతర ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. అస్గర్ ఆలీ గతంలో గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రలలోనూ కీలక నిందితుడిగా ఉన్నారు. చూడలి మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్నది.