కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు, ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ప్రేమించాలంటూ బలవంతం చేశాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో, బలవంతంగా ఆమె నోట్లు పురుగుల మందు పోసి పారిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అశ్విని పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టరు చదువుతోంది. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. తనను ప్రేమించకపోతే చంపేస్తానని చిన్న వీరేష్ బాలికను బెదిరించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుల మందు తాగించాడు. అయితే ఈ గొడవలో వీరేష్ కూడా గాయపడ్డాడు. వ్యవసాయ పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులు చావు బతుకుల్లో ఉన్న కూతురిని చూసి చలించిపోయారు. వెంటనే ఆదోని ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అశ్విని చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ప్రేమ పేరుతో తన కూతురును వేధింపులకు గురి చేసి, అత్యాచార యత్నం చేసిన ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.