సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తన వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేస్తారేమోనని వణికిపోతున్నారు. యువరాజు ఆందోళన నేపథ్యంలో సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై ఆందోళన నెలకొంది. అమెరికన్ వెబ్‌సైట్ ‘పొలిటికో’ ప్రకారం, అతను US చట్టసభ సభ్యులతో చర్చల సమయంలో హత్యపై ఆందోళన వ్యక్తం చేశాడు. పొలిటికో కథనం ప్రకారం, ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అమెరికా చట్టసభ సభ్యులకు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించే ఒప్పందం చేసుకోవడం ద్వారా తన ప్రాణాలను పణంగా పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని హత్యకు గురైన ఈజిప్టు అధినేత అన్వర్ సాదత్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు, సాదత్‌ను రక్షించేందుకు అమెరికా తీసుకున్న చర్యల గురించి ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడంలో ఆయన ఎదుర్కొనే బెదిరింపులు, గాజాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్న అరబ్ దేశాల్లో తనపై ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చించినట్టు తెలిసింది.