ఆస్ట్రేలియా 2025కి అంతర్జాతీయ విద్యార్థుల నమోదు సంఖ్యపై అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో, ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయనుంది. 2025 విద్యా సంవత్సరానికి 2,70,000కు ఆస్ట్రేలియా పరిమితం చేస్తున్నట్టు ప్రకటించింది. విశ్వవిద్యాలయాల్లో 1,45,000, నైపుణ్య శిక్షణ విభాగంలో 95,000 మంది విదేశీ విద్యార్థులను అనుమతించేలా ప్రభుత్వం పరిమితులు విధించనుందని ఆస్ట్రేలియా విద్యాశాఖమంత్రి జాసన్ క్లేర్ తాజాగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో 2025 సంవత్సరానికి గానూ విశ్వవిద్యాలయాల్లో 15 శాతం తక్కువగా, ఒకేషనల్ కాలేజీల్లో 20 శాతం తక్కువగా విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు.
రికార్డు స్థాయిలో వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఇళ్ల అద్దెల కట్టడికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిమితం చేయనున్న సీట్లకు సంబంధించి ఉన్నత విద్యా కోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, ట్రైనింగ్ కోర్సులు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్‌కు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు. 2022 నాటికి ఆ దేశంలో 1.09 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. 2019 నుంచి ఏటా ఆస్ట్రేలియాలో భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో చదువు కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న విద్యార్థులపై ఈ ప్రకటన ప్రభావం చూపుతుందని, పంజాబ్‌కు చెందిన విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతారని పేర్కొన్నారు.