బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి, ఇది విద్యార్థులు మరియు నిరుద్యోగుల నిరసనలతో అతలాకుతలమైంది. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. విద్యార్థుల ఆందోళనను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవడంతో మిలటరీని రంగంలోకి దించింది. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రాజధానిలోనే 52 మంది చనిపోయారు. చాలా మరణాలకు పోలీసుల కాల్పులే కారణమని తెలుస్తోంది.

ఇంటర్నెట్ నిలిపివేత: రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ మరణాలకు ప్రధానమంత్రి షేక్ హసీనా కారణమని, ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

జైలుకు నిప్పు: నర్సింగ్డి జిల్లాలో ఆందోళనకారుల జైలును ముట్టడించి ఖైదీలను విడుదల చేశారు. అనంతరం జైలుకు నిప్పు పెట్టారు. వందలాది మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ మాట్లాడుతూ విద్యార్థి నిరసనకారులపై దాడులు దిగ్భ్రాంతికరమని, ఆమోదయోగ్యం కాదని అన్నారు.

ఎందుకీ ఆందోళనలు: స్వతంత్ర దేశం కోసం పాకిస్థాన్‌తో 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో పాల్గొన్న వారి పిల్లలు సహా కొన్ని నిర్దిష్ఠ సమూహాలకు సగానికిపైగా సివిల్ సర్వీస్ పోస్టుల్లో రిజర్వ్ చేసిన కోటా వ్యవస్థకు ముగింపు పలకాలంటూ ఈ నెలలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రధాని హసీనాకు మద్దతిచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారనే విమర్శలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *