బంగ్లాదేశ్‌లో విద్యార్థులు, ప్రజల నిరసనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆ దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) విచారం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ ప్రజల విజయాన్ని అడ్డుకోవడానికి హసీనా భారత్ నుంచి కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. వెంటనే తనను అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన ఆందోళనలో విద్యార్థులతో పాటు బీఎన్‌పీ పార్టీ కూడా కీలక పాత్ర పోషించింది. ఆందోళనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, వారి మరణాలకు మాజీ ప్రధాని హసీనా, ఆమె అనుచరులు కారణమని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హసీనాపై రెండు హత్యలతో పాటు 31 కేసులు నమోదయ్యాయి. హసీనాపై విచారణ జరిపి న్యాయమైన రీతిలో బంగ్లాదేశ్‌కు అప్పగించాలని బిఎన్‌పి పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ డిమాండ్ చేశారు.