బంగ్లాదేశ్ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం పార్లమెంటును రద్దు చేశారు. దేశంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో పార్లమెంట్ ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారని పలు సంస్థలు తెలుపుతున్నాయి. నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో పార్లమెంట్ రద్దు చేయడం సైతం ఒకటని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ కోటా నిరసనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేసి భారత్ కి చేరుకున్నారు. అనంతరం దేశ అధికారిని ఆర్మీ హస్తగతం చేసుకుంది. మాజీ ప్రధాని, ప్రతి పక్ష నేత ఖలేదా జియా విడుదలకు ప్రెసిడెంట్ మహ్మద్ షహబుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా విద్యార్థి నిరసనల్లో అరెస్టైనవారికి స్వేచ్ఛ కల్పించాలని ఆర్మీ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు.