కెనడాలో విద్యనభ్యసిస్తూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విదేశీ విద్యార్థుల పట్ల కెన‌డా జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై వారమంతా కలిపి 24 గంట‌లకు మించి కాలేజీ క్యాంపస్ బయట ప‌నిచేయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. ఈ కొత్త నిబంధ‌న ఈ వారంలోనే అమ‌ల్లోకి రానుంది. ఈ నిబంధ‌న కార‌ణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్ష‌లాది మంది విదేశీ విద్యార్థులకు, ప్ర‌ధానంగా అధిక సంఖ్య‌లో ఉన్న‌ భారతీయ విద్యార్థులకు తీవ్రమైన ఆర్థిక కష్ఠాలు చుట్టుముట్టనున్నాయి. కాగా, గ‌తంలో కెనడాలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే క్యాంపస్‌ వెలుపల పనులు చేసుకునేందుకు వీలుండేది.

అయితే, క‌రోనా సమయంలో ఆ దేశంలో కార్మికుల కొరత ఏర్పడటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఎత్తి వేశారు. ఈ వెసులుబాటు గడువు ఈ ఏడాది ఏప్రిల్‌ 30తో ముగియడంతో ఇప్పుడు కొత్త నిబంధనను తీసుకొస్తున్నారు. 2022లో కెనడాలోని 5.5 లక్షల మంది విదేశీ విద్యార్థులలో 2.26 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండ‌డం గ‌మ‌నార్హం. సుమారు 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ‌ ఆర్థిక వ్యవస్థకు సహకరించడం జ‌రిగింది.

క్యాంపస్ వెలుపల ఉద్యోగాల ద్వారా వ‌చ్చే ఆదాయం భారతీయ విద్యార్థులకు వారి నెలసరి ఖ‌ర్చుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. కాగా, అక్క‌డ పనివేళ నిబంధలు ప్రకారం స్టాండర్డ్ వర్క్ షిఫ్టులు 8 గంటల నిడివితోనే ఉంటాయి. దాంతో ఇప్పుడు తీసుకువ‌చ్చిన కొత్త నిబంధ‌న‌ ప్రకారం విద్యార్థులు వారానికి మూడు పార్ట్-టైమ్ షిఫ్టుల వరకు మాత్రమే పని చేయగలరు. దీని వలన వారు తమ అద‌న‌పు ఖర్చులను భరించడం కష్టమవుతుంద‌ని విద్యార్థులు వాపోతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *