Earthquake Hits Indonesia: ఇండోనేసియాలో సోమవారం తనింబర్ దీవుల ప్రాంతంలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఇది నమోదైనట్టు జర్మన్ జియోసైన్సెస్ పరిశోధన కేంద్రం (GFZ) తెలిపింది. మధ్యాహ్నం 12:49 గంటలకు సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తువాల్ నగరానికి 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టమైన సమాచారం వెలువడలేదు. జాతీయ విపత్తు స్పందన బృందాలు సహాయక చర్యలు ప్రారంభించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం.
ఇండోనేసియా భూకంపాలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతంగా ఉంది. గతంలోనూ అక్కడ తీవ్రమైన భూకంపాలు సంభవించాయి. 2021లో జరిగిన 6.2 తీవ్రత గల భూకంపంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 2018లో పాలూ ప్రాంతంలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా 2,200 మందికిపైగా మరణించారు. ఇక 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన 9.1 తీవ్రత గల మహాభూకంపం కారణంగా వచ్చిన భారీ సునామీతో ఇండోనేషియాలో దాదాపు 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లపై కూడా ప్రభావం చూపించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
Internal Links:
అమెరికా మరోసారి టారిఫ్ ఆయుధంతో దూకుడు..
External Links:
ఇండోనేసియాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు బెంబేలు