విద్యార్థుల ఆందోళనతో పదవికి రాజీనామా చేసి హఠాత్తుగా భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇబ్బందులు తప్పేలా లేవు. హసీనా అప్పగింత విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈ విషయంపై బంగ్లా విదేశాంగ శాఖ సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం ఉందని చెప్పారు. హసీనాపై బంగ్లాదేశ్‌లో మూడు హత్య కేసులు, ఇతర కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. హసీనాను తమకు అప్పగించాలని, స్వదేశంలో ఆమె విచారణకు సహకరించాలని ఇప్పటికే భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని హుస్సేన్ తెలిపారు.

అయితే ఎన్నిసార్లు విజ్జప్తి చేసినా భారత ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని మీడియాకు వివరించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలా వద్దా అనేది భారత ప్రభుత్వమే నిర్ణయించాలని ఆయన అన్నారు. అయితే హసీనాపై నమోదైన కేసులను విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆమెను తప్పకుండా బంగ్లాదేశ్ కు రప్పించాలని చెబుతూ ఈ విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏంచేయడానికైనా వెనకాడదని స్పష్టం చేశారు. హసీనా భారత్‌లో ఎక్కడ దాగి ఉందో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలుసా అని మీడియా ప్రశ్నించగా, ఆ విషయం భారత ప్రభుత్వాన్నే అడగాలంటూ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *