పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గత వారం నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దూకుడుగా దాడి చేస్తోంది. మొదట కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది, తర్వాత రాకెట్లను ఉపయోగించారు. పేజర్లు, వాకీటాకీలు పేలడంతో వందలాది మంది చనిపోయారు. ఆ తర్వాత రాకెట్ దాడిలో 557 మంది చనిపోగా, వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. బుధవారం నాటి దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. తాజాగా గురువారం నాడు లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 23 మంది సిరియన్లు మృతి చెందినట్లు లెబనీస్ వార్తా సంస్థ వెల్లడించింది.
భారత్, బ్రిటన్ సహా పలు దేశాలు తమ పౌరులకు ఆదేశాలు జారీ చేశాయి. వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలని కోరారు. మరోవైపు లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పశ్చిమాసియా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటంలో 21 రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా మరియు దాని మిత్రదేశాల ఒత్తిడికి తమ ప్రభుత్వం స్పందించలేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం చెప్పారు. పూర్తి శక్తితో పోరాటం కొనసాగించాలని నెతన్యాహు సైన్యానికి చెప్పారు.