అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి, ఇప్పుడు ఓడిపోతే మళ్లీ పోటీ చేయనని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2016లో తొలిసారి అధ్యక్ష రేసులోకి దిగిన ట్రంప్ డెమొక్రాట్ల తరఫున పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ ను ఓడించారు. నాలుగేళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఈసారి డెమోక్రాట్ల తరఫున జో బైడెన్ పోటీ చేశారు. అయితే, బైడెన్ చేతిలో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఫలితాల ప్రకటన తర్వాత ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైట్ హౌస్ ఎదుట ఆందోళన చేసినా సంగతి తెలిసిందే.
తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ట్రంప్ కు ప్రత్యర్థిగా తొలుత జో బైడెన్ ఉన్నారు. ట్రంప్ తో జరిగిన డిబేట్ లో వెనకబడడం తదితర కారణాలతో బైడెన్ తప్పుకోగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధ్యక్ష రేసులోకి అడుగుపెట్టారు. ట్రంప్, హారిస్ ఇద్దరూ సమ ఉజ్జీలేనని, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ ఈసారి ఓడిపోతే ఇక అంతే. మరోసారి పోటీ చేయబోనని తేల్చిచెప్పారు. అయితే, గెలుపు తననే వరిస్తుందని పూర్తి నమ్మకం ఉందని ట్రంప్ చెప్పారు.