కాకినాడ: పానీపూరీ తినడంతో ఇద్దరు పిల్లలు-వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6) బుధవారం రాత్రి మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పానీపూరీ తినడంతో పిల్లలకు కడుపునొప్పి రావడంతో జంగారెడ్డిగూడెంలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. వారిని ఏలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతదేహాలను జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పానీపూరీ తినడం వల్లే పిల్లలు చనిపోయారన్నది కచ్చితంగా చెప్పలేమని జంగారెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.మల్లికార్జునరెడ్డి డెక్కన్ క్రానికల్‌తో అన్నారు. పానీపూరీ తిన్నాక శెనగలు, సాంబారు, పెరుగుతో పాటు అన్నం తిని పిల్లలు కడుపునొప్పితో బాధపడ్డారని తెలిపారు. ఈ ఘటనపై ప్రాథమిక ఆధారాలను సేకరించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడి కుటుంబం జీవనోపాధి కోసం నంద్యాల నుంచి జంగారెడ్డిగూడెంకు వలస వచ్చింది. ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నారు.