గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర జీఎస్టీ నుండి ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం పెరిగింది. ఈ విషయాన్ని గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ కమిషనర్ పి. ఆనంద్ కుమార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రూ. 25 వేల కోట్లు అని, ఇది గత సంవత్సరం కంటే ఒక శాతం ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలోని జీఎస్టీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను వివరించారు.
అనంతపురం జిల్లాలో కియా సంస్థ ఉండటం వల్ల అక్కడ పన్ను వసూలు ఎక్కువగా ఉంటుందని చెప్పిన ఆయన, విశాఖలో తగ్గడానికి స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉండటం ఒక కారణంగా పేర్కొన్నారు. 2024-25లో రూ.1,510 కోట్ల కేంద్ర జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించామని ఆయన అన్నారు. 2023-24లో రూ.2,682 కోట్ల పన్ను ఎగవేసినట్లు వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 1.81 లక్షల మంది సీజీఎస్టీ చెల్లిస్తున్నారని, 2 లక్షల మందికి పైగా రాష్ట్ర జీఎస్టీ చెల్లిస్తున్నారని ఆయన వివరించారు. నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ప్రభుత్వ ఆదాయాన్ని మోసం చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన అన్నారు.